ఐపీఎల్ 6 ఛా౦పియన్ ముంబయి
posted on May 27, 2013 @ 10:40AM
చెన్నయ్ సూపర్ కింగ్స్ మూడో టైటిల్ ఆశకు మరోసారి బ్రేక్ పడింది. ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ 6లో చాంపియన్‌గా నిలిచింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఫైనల్లో ముంబయి 23 పరుగులతో రెండుసార్లు చాంపియన్ చెన్నయ్‌కు షాకిచ్చింది. ముంబయి నిర్దేశించిన 149 పరుగుల లక్ష్యా న్ని ధోనీసేన ఛేదించలేకపోయింది. 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 125 రన్స్‌కే పరిమితమైంది. కెప్టెన్ ధోనీ 45 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 63 నాటౌట్ పోరాటం విజయాన్ని అందించలేకపోయింది. హర్భజన్ (2/14), జాన్సన్ (2/19), మలింగ (2/22) రెండేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 148 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైనా కీరన్ పొలార్డ్ (32 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. అంబటి రాయుడు (36 బంతుల్లో 4 ఫోర్లతో 37) రాణించాడు. దీంతో ముంబయి గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. డ్వెన్ బ్రావో 4 వికెట్లు పడగొట్టాడు. అల్బీ మోర్కెల్‌కు రెండు వికెట్లు దక్కాయి. పొలార్డ్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.
1-1, 2-2, 3-3... కష్ట సాధ్యంకాని లక్ష్య ఛేదనలో చెన్నయ్ వికెట్లు కోల్పోయిన తీరిది. ఈ సీజన్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్న మైకేల్ హస్సీ (1), సురేష్ రైనా (0) మలింగ మ్యాజిక్‌కు తొలి ఓవర్లోనే పెవిలియన్‌కు చేరారు. బద్రీనాథ్ (0) జాన్సన్‌కు చిక్కాడు. దీంతో చెన్నయ్ మూడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. మురళీ విజయ్ (18), బ్రావో (15), జడేజా (0), మోర్కెల్ (10)తీవ్రంగా నిరాశపర్చారు. చివరిలో ధోనీ, అశ్విన్ (9) ఆశలు రేకెత్తించినా ఫలితం దక్కలేదు.